‘ఉప్పెన’కి సీక్వెల్ ప్లాన్ లో బుచ్చిబాబు?

ఈ మధ్య కాలంలో తెలుగు తెరను పలకరించిన ప్రేమకథల్లో ‘ఉప్పెన’ ముందువరుసలో కనిపిస్తుంది. హీరో .. హీరోయిన్ .. దర్శకుడు .. ఈ ముగ్గురికీ ఇదే మొదటి సినిమా. అయినా కథాకథనాలు .. పాటలు కారణంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించేసింది. దర్శకుడిగా బుచ్చిబాబుకి మంచి పేరు వచ్చింది.

అయితే ఫస్టు మూవీ ఒక రేంజ్ లో హిట్ అయినప్పటికీ, ఇంతవరకూ ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేపోయాడు. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నట్టు ఆ మధ్య చెప్పినా, అది ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు. మరి ఇప్పుడు బుచ్చిబాబు ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నకు సమాధానంగా, ‘ఉప్పెన’ సీక్వెల్ మాట వినిపిస్తోంది.

‘ఉప్పెన’కి సీక్వెల్ చేయాలనే ఆలోచనతో అందుకు సంబంధించిన కథపై బుచ్చిబాబు కసరత్తు చేస్తున్నాడట. ఈ సారి ఆయన పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తుండటం ఇక్కడ విశేషం. అందుకు సంబంధించిన మిగతా పనులు కూడా మొదలైపోయాయని అంటున్నారు. మరి బుచ్చిబాబు ఈ సీక్వెల్ కథను ఎక్కడి నుంచి మొదలుపెడతాడో .. ఏం చెప్పాలనుకుంటున్నాడో చూడాలి.