ప్రతిపక్షాలు గొంతు నొక్కితే మహిళలకు రక్షణ లభిస్తుందా?: షేక్ రియాజ్

*ఆడబిడ్డలు భయంభయంగా ఉన్నారు
*శాంతిభద్రతల వైఫల్యానికి సకల శాఖల మంత్రి శ్రీ సజ్జల బాధ్యత వహించాలి

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లభించడం లేదు అనే మాట నూటికి నూరుపాళ్లు నిజం. బాపట్లలో భర్త కళ్లెదుటే ఒక ఎస్సీ మహిళను కామాంధులు ఈడ్చుకుపోయి అత్యాచారం చేసిన ఘటన అత్యంత అమానవీయం. దీనిపై కూడా సిబిఐ దత్తపుత్రుడు… రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన శ్రీ జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. ఈ వైఫల్యం మీద ప్రతిపక్ష పార్టీలు కచ్చితంగా నిరసన చెబుతాయి. ప్రతిపక్షాలు గొంతెత్తితే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది. ప్రభుత్వం చేతగానితనం… పోలీసు శాఖను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకోవడం వల్లే శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులపై విరుచుకుపడుతున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి వారి తరఫున నిలబడటం మా బాధ్యత. మా గొంతు నొక్కితే మహిళలకు రక్షణ లభిస్తుందా?.. రాష్ట్రంలో ఆడబిడ్డలు భయంభయంగా బతుకుతున్నారు అనే విషయం తాడేపల్లి ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్న శ్రీ జగన్ రెడ్డికి తెలుస్తోందా? మహిళలపై అఘాయిత్యాలు ప్రతి ఏటా పెరిగిపోతున్నా ప్రభుత్వం ఎందుకింత నిర్లిప్తంగా ఉందో అర్థం కావడం లేదు. ఒంగోలు రిమ్స్ లో ఉన్న బాధితుల కుటుంబాన్ని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులను కలవనీయకుండా పోలీసులు కట్టడి చేయడానికి కారణం ప్రభుత్వ చేతగానితనం బయటపడుతుందనే. ప్రతిపక్షాలను అరెస్టులు చేసే బదులు మహిళకు రక్షణ కల్పించడం కోసం పోలీసులను వినియోగిస్తే ఫలితం ఉంటుంది.
రాష్ట్రంలో ఆడ బిడ్డలపై అత్యాచారాలు సాగుతున్నాయి. అలాగే విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ లభిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు గంజాయి సరఫరాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉంది అని గుంటూరు రేంజి డిఐజీ స్వయంగా చెప్పారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం హోమ్ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత ఉన్నత విద్యావంతురాలైనా ఆమెకు ఎలాంటి అధికారం లేదని తెలుస్తోంది. అందుకే ఆమె శాఖపై పట్టు తెచ్చుకోవడం లేదు… అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం అన్ని శాఖలపై శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం చెలాయించడమే. మహిళలపై ఆగని అఘాయిత్యాలకు, గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్.. విక్రయాలు పెరగడాన్ని ఏ విధంగా అదుపు చేస్తారో సకల శాఖల మంత్రి శ్రీ సజ్జల సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పడానికి సకల శాఖల మంత్రి బాధ్యత వహించాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ డిమాండ్ చేశారు.