రోడ్లు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో

విజయనగరం ప్రధాన కూడలైన జిల్లా కలక్టరేట్ నుంచి కామాక్షి నగర్ మీదుగా అయ్యన్నపేట జంక్షన్ వరకు రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉండటంతో వెంటనే రోడ్లు మరమ్మతులు చేపట్టాలని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో జిల్లా రోడ్లు& భవనాలశాఖ, కార్యనిర్వాహక ఇంజనీర్ జి. వి. రమణ కు శనివారం ఉదయం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..విజయనగరం జిల్లా కలక్టర్ కార్యాలయం నుండి అయ్యన్నపేట జంక్షన్ కు వెళ్లే రహదారి మొత్తం చాలా దారుణంగా మారిందని, అటువైపుగా వెళ్లే వాహన చోదకులు అవస్థలు వర్ణనాతీతమని, ఎన్నో ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈరహదారి దర్శనం ఇస్తుందని.. జిల్లా కేంద్రంలో అందునా కలక్టర్ కార్యాలయం సమీప రహదారులను కూడా బాగు చేయకుండా జిల్లా యంత్రాంగం అశ్రద్ధ వహిస్తున్నారని,అందుమూలన ఈ సమస్యను తీసుకురావడం కోసం ఈ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నామని తెలిపారు. అలాగే అదే దారిలో కామాక్షి నగర్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ వద్ద కనీసం వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్స్ వేయాలని అక్కడ విద్యార్థుల తలిదండ్రుల తరఫున మేము మీకు తెలియజేస్తున్నామని, స్కూల్ తెరిచే సమయంలో అలాగే స్కూల్ విడిచాక విద్యార్థులతో అక్కడ ఉన్న దారంతా కాస్త గందరగోళంగా ఉంటుందని, ఆ దారిలో వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడం వల్ల విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశంఉందని, అందుమూలాన స్కూల్ వద్ద మరియు అయ్యన్నపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ వేయాలని కోరుతున్నామని తెలిపారు. గత కొద్ది నెలలుగా జిల్లాలో అనేక రహదారులు అస్తవ్యస్తంగా మారాయన్న సంగతి ప్రజలందరి కీ విధితమేనని..
అనేకమార్లు వినతిపత్రాలు ఇస్తున్నా సరైన స్పందన ప్రభుత్వం నుండి కరువైందని వాపోయారు. ఇప్పటికైనా ఈ రహదారులు మరమ్మత్తులు చేసి ప్రజల అసౌకర్యాన్ని తీర్చాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నామని లేదంటే రోడ్లు మరమ్మతులు చేపట్టేవరకు జనసేన పార్టీ పోరాడుతోందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ, జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి శ్రీమతి కాటం అశ్విని, జనసేన పార్టీ యువ నాయకులు దాసరి యోగేష్, బూర్లీ వాసు,రవిరాజ్ చౌదరి, లావుడి నిరంజన్ కుమార్, లోపింటి కళ్యాణ్,బూర వాసు పాల్గొన్నారు.