1-7 తరగతులకు సిబిఎస్‌ఇ విధానం

అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-7వ తరగతి వరకూ సిబిఎస్‌ఇ విధానం అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. తర్వాత తరగతులకు ఒక్కో ఏడాది అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సిఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులను సిబిఎస్‌ఇ విధానంలోకి తీసుకురావాలని చెప్పారు. చిన్నారులకు బోధన ఎలా చేయాలన్న అంశంపై అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వాలని, టీచర్లకు కూడా కొనసాగాలని ఆదేశించారు. ఎంతవరకు నేర్చుకున్నారన్న దానిపై రెండు నెలలకోసారి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని వెల్లడించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా అన్నదానితో సంబంధం లేకుండా శిక్షణ కార్యక్రమాల ద్వారా పరిశీలించి మరింత శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పక్కా భవనాలు లేని 390 ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని ఆదేశించారు. నాడు-నేడు మొదటి దశ పనులు మార్చి నాటికి పూర్తిచేయాలని చెప్పారు.

రెండో దశలో మరింత మార్పులు చేయాలని, విద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. విద్యాకానుకలో ఇంగ్లీష్‌-తెలుగు డిక్షనరీ తప్పనిసరిగా చేర్చాలని ఆదేశించారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా కానుకలో ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉండాలని చెప్పారు. టీచర్లకు కూడా డిక్షనరీలు ఇవ్వాలని తెలిపారు.

అమ్మఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమన్నారు. విద్యార్థుల హాజరు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభత్రకు 27 వేల మంది ఆయాలను నియమించామని సిఎంకు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌, కమిషనరు చినవీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.