సాగు చట్టాలపై దిగొచ్చిన కేంద్రం.. వాయిదా వేసేందుకు సిద్ధం..

సాగు చట్టాలపై రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది..! ఈ చట్టాలను రద్దుచేయాలని దిల్లీ సరిహద్దుల్లో 50 రోజులకుపైగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిపిన పదో విడత చర్చల్లో కీలక ప్రతిపాదనలు ఉంచింది. రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో ఉమ్మడిగా కమిటీ వేసి వ్యవసాయ చట్టాల్లో ఉన్న అభ్యంతరాలపై అధ్యయనం చేస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్‌, పీయూష్‌గోయల్‌, సోంప్రకాశ్ ప్రతిపాదించారు. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకు సాగు చట్టాల అమలును ఏడాది నుంచి 1.5 ఏళ్ల వరకు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దీనిపై చర్చించుకొని నిర్ణయం చెప్పాలని రైతు సంఘాలను కోరారు. అయితే, చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనపై కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్రం ప్రతిపాదనపై తాము చర్చించుకొని నిర్ణయం చెబుతామన్నారు. అనంతరం ఎల్లుండి (ఈ నెల 22న) మరోసారి సమావేశమై చర్చలు జరపాలని ఇరువురు నిర్ణయించారు.

పదో విడత చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపివేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో పరస్పరం చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ రోజు జరిగిన చర్చలు రైతుల తమ ఆందోళనల్ని విరమించి, చర్చలు కొనసాగేలా దోహదపడతాయని భావిస్తున్నానన్నారు. ఈ నెల 22న జరగబోయే సమావేశంతో రైతుల ఆందోళన ముగిసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.