వైట్ హౌస్ ను ఖాళీ చేసిన ట్రంప్…

అమెరికా 45 అధ్యక్షుడి పదవీకాలం నేటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి 10:30 గంటల సమయంలో 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసే ముందే ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను ఖాళీ చేశాడు. కొద్దిసేపటి క్రితమే ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేసి తన సొంత రాష్ట్రం ఫ్లోరిడాకు వెళ్లిపోయారు. జో బైడెన్ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉంటున్నానని ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో వైట్ హౌస్ ను వదిలి వెళ్తున్నానని అన్నారు.

ఇదిలా ఉంటే.. ట్రంప్ చిన్న కూతురు తాజాగా పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ట్రంప్ మంగళవారం చివరిగా రోజంతా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే రోజు ట్రంప్ చిన్న కూతురు టిఫనీ ట్రంప్(27) నిశ్చితార్థం వైట్‌హౌస్‌లో జరిగింది. ఈ విషయాన్ని కొద్ది గంటల క్రితం టిఫనీ ట్రంప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.

‘వైట్‌హౌస్‌లో గత నాలుగేళ్లలో ఎన్నో చారిత్రాత్మక వేడుకలు జరుపుకున్నాను. వైట్‌హౌస్‌లో నా కుటుంబంతో ఎన్నో జ్ఞాపకాలను ఏర్పరచుకున్నాను. ఇప్పుడు నా నిశ్చితార్థం వాటన్నిటి కంటే ప్రత్యేకమైనది’ అంటూ తనకు కాబోయే భర్త మైఖేల్ బౌలోస్‌తో కలిసి దిగిన ఫొటోను టిఫనీ పోస్ట్ చేశారు. వైట్‌హౌస్‌ను తన తండ్రి వీడుతుండటంతో, మళ్లీ ఇటువంటి అవకాశం రాదేమోనని వైట్‌హౌస్‌లో టిఫనీ నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. టిఫనీకి కాబోయే భర్త ఆమె కంటే నాలుగేళ్లు చిన్నవాడు కావడం విశేషం. వీరిద్దరూ 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. కాగా.. టిఫనీ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్, తన రెండో భార్య మార్లా మేపుల్స్‌కు జన్మించారు.