కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి

వివిధ వస్తు సముదాయాన్ని ఉత్పత్తిదారులు దేశంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకుంటున్నారని.. రైతుకు మాత్రం ఈ హక్కు ఉండకూడదా అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నిస్తూ.. ప్రస్తుతం కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బుధవారం విజయవాడ, గన్నవరంలో కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యవసాయ రంగ నిపుణులతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మల మాట్లాడుతూ ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమేనని అన్నారు. దీనివల్ల రైతులకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్, విపక్షాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మంచి ధర కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కాయగూరలు, పళ్లు అమ్ముకుంటే ఏంటి అభ్యంతరం అని ఆమె నిలదీశారు. మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని కొత్త వ్యవసాయ చట్టాలతో మార్కెట్‌కు వెళ్లకుండానే సరుకు అమ్ముకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కొత్త చట్టాలతో దళారులకే నష్టమని రైతులకు కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి ధర ఇవ్వాల్సిందేనని అన్నారు. అతి తక్కువ వర్షపాతం ఉండే ఖచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. ఇందువల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని తెలిపారు.