సెంట్రల్ విస్టా అవసరమే.. పనులు ఆపే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమేనని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. పనులు చేసుకునేందుకు లైన్ క్లియర్ చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపేయాలంటూ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్ కు లక్ష రూపాయల జరిమానాను విధించింది.

కరోనా బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది.