బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ రీమేక్.. హీరోగా బెల్లంకొండ

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. తొలిసారిగా వీరిద్దరి కాంబో లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో మాస్‌లో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో మంచి హృద్యమైన కథగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రాజమౌళి ఎంతో గొప్పగా తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నారు. అసలు విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ అయిన పదిహేనేళ్ల తరువాత ప్రస్తుతం ఈ సినిమాని బాలీవుడ్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో రీమేక్ చేస్తున్నారు. కాగా దీనిలో హీరోగా టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తుండగా దీనికి టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతి లాల్ గడ ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది.

తొలిసారిగా ఇంత భారీ సినిమా ద్వారా అలానే ఇటువంటి ప్రతిష్టాత్మక బ్యానర్ ద్వారా బాలీవుడ్ కి పరిచయం అవడం ఆనందంగా ఉందని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. మరోవైపు ఈ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉందని, ఆ విధంగా యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి పని చేస్తాం అని దర్శకడు వివి వినాయక్ అంటున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మరి తొలిసారిగా బెల్లం బాబు బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా అతడికి ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.