దేశంలోనే అతి పెద్ద ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి

  • ఊహించని ప్రజా వ్యతిరేకతతో ఓటమి అంచులో వైసీపీ ప్రభుత్వం
  • ముఖ్యమంత్రి మొహంలో ప్రస్ఫుటంగా ఓటమి ఛాయలు
  • వైసీపీ నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్న దళితులు, ముస్లిం మైనారిటీలు, బీసీలు, కాపులు
  • ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు ఆవహించిన పరాజయ నిర్వేదం
  • 175 కి 175 నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని హీన, దీన స్థితిలో వైసీపీ
  • పాలనంతా అరాచకం – అడుగుదూరంలో పరాజయం పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: తన అసమర్ధ, అవగాహనా రాహిత్య, అరాచక పాలనతో దేశంలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో రికార్డు స్థాయి మెజారిటీ ఇచ్చినా పరిపాలన చేతకాక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయాల్లోనే ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. 22వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో రూపొందించిన పాలనంతా అరాచకం – అడుగుదూరంలో పరాజయం పోస్టర్లను శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసిపి పాలనపై క్షేత్రస్థాయిలో ఊహించని ప్రజా వ్యతిరేకత నెలకొందన్నారు. దీంతో ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు నిర్వేదంలో మునిగిపోయారన్నారు. ఓటమి తప్పదన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహించారన్నారు. మనసావాచా నమ్మి వెన్నంటి నడిచిన దళిత, ముస్లిం మైనారిటీ, బీసీ, కాపు వర్గాల జీవితాలను వైసీపీ చిన్నాభిన్నం చేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నమ్మకద్రోహాన్ని ఆయా వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 175 కి 175 అంటూ ఒకప్పుడు బీరాలు పోయిన వైసీపీ నేతలు ఇప్పుడు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని దీన, హీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యకర్తల్లో కోల్పోయిన ధైర్యాన్ని నింపేందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు కట్టడం సిగ్గుచేటన్నారు. ఎంతగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ముఖ్యమంత్రి మొహంలో ఓటమి ఛాయలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయన్నారు. ప్రజలు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు సంసిద్ధులై ఉన్నారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వ్యాపారులు, రోజువారీ కూలీలు ఇలా ప్రతీ ఒక్కరినీ, అన్ని వర్గాలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దగా చేసారని దుయ్యబట్టారు. తమ నియంతృత్వ పోకడలను ప్రశ్నిస్తే సామాన్యుల దగ్గర నుంచి ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని మానసిక, భౌతిక దాడులకు సైతం వైసీపీ నాయకులు పాల్పడటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలైన సీపీయస్ రద్దు, పోలవరం నిర్మాణం, మద్యపాననిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి వాటిని వైసీపీ నెరవేర్చకపోవటాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. వైసీపీకి ఓటు వేసేందుకు ప్రజలు ఇష్టపడటం లేదన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఎదురయ్యే ఘోర పరాజయం నుంచి వైసీపీని ఏ శక్తి రక్షించలేదని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో రెళ్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ నాగూర్, జనసేన డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ, గడ్డం రోశయ్య, నండూరి స్వామి, కోలా అంజి, బాలకృష్ణ, వడ్డె సుబ్బారావు, కోలా మల్లికార్జున, బాలు, ఉప్పుతల రాజు తదితరులు పాల్గొన్నారు.