చీరాల నియోజకవర్గంలో పర్యటించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

  • చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

ఉమ్మడి ప్రకాశం జిల్లా, చీరాల నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వేటపాలెం, ఈపురుపాలెం, కటారి పాలెం తదితర గ్రామాలలో పర్యటించి స్వయంగా ప్రతి చేనేత గృహాన్ని సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడి చేనేత కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. తదనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… నేడు చేనేత రంగం ప్రస్తుతం ప్రభుత్వ విధానాలవలన కుదేలై పోతుందని మరియు పెరుగుతున్న నూలు మరియు పట్టు రేట్ల వలన చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మరియు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీ చేనేత కమిటీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేనేతల సమస్యల మీద నివేదికలు అందిస్తామని మరియు వాటి పరిష్కారానికి కచ్చితంగా పోరాడుతామని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికుడిని వ్యాపారవేత్తగా తయారుచేయడమే జనసేన ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి తోట రాజశేఖర్, వేటపాలెం మండల అధ్యక్షులు యు.మార్కండేయులు, మరియు చీరాల నియోజకవర్గ నాయకులు హనుమకొండ కిషోర్, గుత్తి సదాశివరావు మరియు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.