సీఎం జగన్ కి విజయనగరం జిల్లాలో పర్యటించే అర్హత లేదు

విజయనగరం: ఉత్తరాంధ్రాను నిర్లక్ష్యం చేసిన సీఎం జగన్ కి విజయనగరం జిల్లాలో పర్యటించే అర్హత లేదని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం విజయనగరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరులసమావేశంలో గురాన అయ్యలు, బాబు పాలూరి, మర్రపు సురేష్, ఆదాడ మోహన్, తుమ్మగంటి సూరినాయుడు, రమేష్ రాజు తదితరులు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టుకు మళ్లీ శంకుస్థాపన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. విశాఖ రాజధానిని ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఎయిర్ పోర్టును తెరపైకి తీసుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా భోగాపురం విమానాశ్రయం నిర్మించే ఉద్దేశమే జగన్ ప్రభుత్వానికి ఉండి ఉంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టి ఈపాటికి నిర్మాణం పూర్తి చేసేవారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం పట్టణానికి తాగునీరు, నెల్లిమర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన రామతీర్థసాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లాలోని పరిశ్రమలన్నీ మూతపడ్డాయని, దీంతో లక్షలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. అయినా వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలు సొంత డబ్బులతో నిర్మించుకున్న ఇళ్లకి జగనన్న స్టిక్కర్లు అంటించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్నులు, అద్దెలతో విజయనగరం కార్పొరేషన్ ఆర్థికంగా బలంగా ఉందని, ఆ నిధులతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధిపనులు చేయడం సర్వసాధారణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఆ నిధులు ఎక్కడనుండో తీసుకువచ్చి పనులు చేస్తున్నట్లు షోవర్కు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి విజయనగరం నియోజకవర్గానికి ఈ నాలుగేళ్ల కాలంలో ఆయన ఏమైనా నిధులు తీసుకువచ్చి పనులు చేయించారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని, అక్కడ ఎందుకు శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టడం లేదని ప్రశ్నించారు. పంచాయితీల్లో నిధులు లేకపోవడమే గ్రామాలను నిర్లక్ష్యం చేయడానికి కారణమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మిడతాన రవికుమార్, త్యాడ రామకృష్ణారావు (బాలు), తుమ్మి అప్పలరాజుదొర, వంకర నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.