ఏపిలో ఒంటి పూట బడులు, వేసవి సెలవుల పూర్తి షెడ్యూల్

ఏపిలో పాఠశాలలకు మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9 తరగతులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి కానుంది. మే 1-10 తేదీల్లో సమ్మేటివ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మే 11 నుంచి 15 వరకు మార్కుల జాబితా రానుంది. అనంతరం అప్లోడింగ్, ప్రమోషన్ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి సెలవులు ఇవ్వనున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం టెన్ విద్యార్థులు, టీచర్లకు ఈ ఏడాది వేసవి సెలవులు లేవు.

పదవ తరగతి విద్యార్థులు షెడ్యూల్ ఇది…

ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం.. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ కంప్లీట్ చేయనున్నారు. మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపరేషన్ ఉంటుంది. మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్‌ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. మే 25 నుంచి జూన్‌ 6 వరకు ఫైనల్‌ పరీక్షలకు ప్రిపరేషన్ ఉంటుంది. జూన్‌ 7 నుంచి 16 వరకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు:

కాగా.. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఎండలు తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కపూటే తరగతుల నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ ఇటీవల అధికారులకు సూచించారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని.. తరువాత మధ్యాహ్న భోజనం ఉంటుందని వెల్లడించారు. పాఠశాలల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై టీచర్లు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కోరారు. విద్యార్థులకు మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం, పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ సూచించారు.