క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వండి

జనసైనికులకు నాదెండ్ల పిలుపు

గుంటూరు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఓ పెను సంచలనం సృష్టించనుందని, పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాల్సిన గురుతర బాధ్యత జనసైనికులపై, పార్టీ వివిధ విభాగాల నేతలపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి నేతృత్వంలో జనసైనికులు నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసైనికులు నేతలు నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, అదే సమయంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జనసేన పార్టీ వైపు చూస్తున్నారన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిపాలన చేతకాని అసమర్థుని నాయకత్వంలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దాష్టీకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమత వర్గ విభేదాలను, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చకొట్టేలా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఈ క్రమంలో ప్రజల్ని చైతన్యం చేయాలని జనసైనికులని నాదెండ్ల మనోహర్ కోరారు.