ప్రభుత్వాన్ని దించేందుకే దేవాలయాలపై దాడుల కుట్ర

ఏపీ  లో గత కొద్దికాలంగా దేవాలయాల్ని టార్గెట్ చేస్తూ దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతోంది. అంతర్వేది ఆలయంలోని రధం దగ్దమైన ఘటన నుంచి ప్రారంభమై.. నిన్నటి రామతీర్ధం ఘటన వరకూ ఇదే పరిస్థితి. ఈ దాడుల్ని నెపంగా పెట్టుకుని ప్రతిపక్షాలు మత రాజకీయాలు ప్రారంభించాయి. ఇప్పడీ విషయంపై త్రిదండి చినజీయర్ స్వామి స్పందించారు. కీలకమైన వ్యాఖ్యల్ని చేశారు.

రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడులు నిజమేనని స్పష్టం చేశారు. అయితే అధికారంలో ఉన్నవారిని దించేందుకే దుష్టశక్తులు ఇలాంటి కుట్రలకు పాల్పడి ఉండవచ్చంటూ కీలకవ్యాఖ్యలు చేశారు త్రిదండి చినజీయర్ స్వామి. విగ్రహాల ధ్వంసానికి కనిపించని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిన పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న అలజడిని తగ్గించేందుకే ఆలయాల సందర్శన చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆలయాల్లో విగ్రహాల స్థితిగతులు, సౌకర్యాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తానని చెప్పారు. దేవాలయాల సంరక్షణ బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజల్లో భక్తి భావం పెరిగినప్పుడే ఆలయాల సంరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయమైనా, మసీదైనా, చర్చి అయనా దాడులు సరికాదని, ఈ తరహా విధ్వంసాలను అందరూ ఖండించాలని కోరారు.