రష్యాలో విజృంభిస్తున్న కరోనా

రష్యాలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల నుంచి ఇక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం రష్యాలో కొత్తగా 40,096 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,159 మంది చనిపోయారు. దీంతో దేశంలో అత్యవసరం కాని సేవలను 11 రోజుల పాటు నిలిపివేశారు. కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కరోనాను నియంత్రించేందుకు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 7 వరకు వారం రోజుల పాటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు.

టీకా ఉత్పత్తిలో ముందున్న రష్యా మాత్రం సకాలంలో దేశ ప్రజలకు టీకాలు అందించలేకపోతోంది. దేశంలో ఇప్పటివరకు 32 శాతం ప్రజలకు మాత్రమే టీకాలు వేశారు. అయితే టీకా తీసుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తి చూపించకపోవడంతోనే కరోనా విజృంభిస్తుందని , టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలను కోరుతున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బహిరంగ ప్రదేశాలకు రావాలని, అలా వచ్చినప్పుడు విదిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.