కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాలు గల్లంతు

దేశంలో కొవిడ్‌-19 రెండో దఫా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌లతో ఏప్రిల్‌లో 75 లక్షలకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయని, దీంతో నిరుద్యోగ రేటు నాలుగు నెలల గరిష్ఠమైన 8 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. సమీపకాలంలో ఉద్యోగాల పరంగా సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహేశ్‌ వ్యాస్‌ వెల్లడించారు. సీఎంఐఈ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. దేశ నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో 9.78 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా నమోదైంది. మార్చిలో నిరుద్యోగ రేటు 6.50 శాతంగా ఉంది.