కరోనా ముప్పు తొలిగిపోలేదు.. ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనగానే చాలా మంది ఆయన నోటి నుంచి వ్యాక్సిన్ కి సంబంధించి ప్రకటన వస్తుంది అని అందరూ భావించారు. కాని మోడీ తన ప్రసంగంలో వ్యాక్సిన్ కి సంబంధించి ఏ ప్రకటన చేయలేదు. వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఆయన సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశం కూడా శ్రమిస్తుంది అని అన్నారు.

లాక్‌డౌన్ ముగిసిందే తప్ప కరోనా వైరస్ ముప్పు తొలిగిపోలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా లేదనే అభిప్రాయానికి ఎవరూ రావొద్దని.. అలా భావించిన వాళ్లు తమతోపాటు తమ కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టినవాళ్లు అవుతారని ప్రధాని అన్నారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు కరోనాతో పోరాటం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాని సూచించారు. కరోనా సంక్షోభంలో జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇప్పటివరకు ప్రజలంతా గొప్పగా సంయమనం పాటించారని అన్నారు.

పండగల సీజన్‌ రావడంతో ప్రజలంతా మళ్లీ మునుపటిలా బయటకు వస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అయితే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాలన్నీ ఎంతగానో శ్రమిస్తున్నాయని మోదీ తెలిపారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.