కౌంటర్ దాఖలు చేయడం మాత్రమే కాదు కేసు చివరివరకు బాధ్యతగా నిలబడాలి: జనసేనాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోరాటం సాగించారు. రాజధానిగా అమరావతి విషయంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం , రాజధాని అమరావతి రైతుల కోసమే పోరాటం సాగిస్తామన్న ధ్యేయంతో ఉన్నారు.

ఏపీ రాజధాని అమరావతి విశాఖ కు తరలించడం పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు లో జరుగుతున్న విచారణ నేపథ్యంలో హైకోర్టు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయం చెప్పాలని అవకాశం ఇవ్వడం జరిగింది . దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుతో ఉండే ఇబ్బంది, రాజధాని అమరావతి భవిష్యత్తు వంటి అనేక అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు సిద్దం అవుతున్న క్రమంలో జనసేన పార్టీ కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం కోసం నిర్ణయం తీసుకుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చించి రాజధాని తరలింపు పై కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కౌంటర్ దాఖలు చేయడం మాత్రమే కాకుండా కేసులో చివరివరకు బాధ్యతగా నిలబడాలని పేర్కొన్నారు. అంతేకాదు న్యాయనిపుణుల సలహా తీసుకొని నిర్ణీత సమయంలోనే కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి అమరావతి ప్రాంత రైతులు 28 వేల మంది 33 వేల ఎకరాలను రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారని, రాజధాని నిర్మాణంలో భాగంగా అక్కడ ఇప్పటికే కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయని, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. రాజధాని కోసం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా కాపాడాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.