జనసేనానితో గుడివాడ నాయకుల మర్యాదపూర్వక భేటి

గుడివాడ, వైసీపీ పాలనలో గుడివాడ అభివృద్ధి నిలిచిపోయింది పేదల ఇళ్ల స్థలాలు ఎవరికిచ్చారో తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాలంకి సోదరులు సారధిబాబు, మోహన్ బాబుల మర్యాదపూర్వక భేటీ. అధినేత చెంతకు గుడివాడ నియోజకవర్గ సమస్యలు. సమస్యలపై పోరాటానికి సానుకూలంగా స్పందించిన జనసేనాని. ఇటీవల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన పాలంకి సారధిబాబు ఆయన సోదరుడు మోహన్ బాబులు మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తమవంతుగా 4 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ తో సుధీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ అభివృద్ధి పూర్తిగా నిలచిపోయిందని, కనీస మౌళిక వసతులు లేక ప్రజలు అడుగడుగునా సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. నిరు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని వైసీపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్న మాటలు పూర్తిగా అవాస్థవం అని చెప్పారు. గుడివాడ పట్టణంలోనే వేలాది మంది పేదలు నేటికీ ఇళ్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ. వైసీపీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ముందుంచారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ మర్యాద పూర్వక భేటీలో ప్రతి సమస్యను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్, గుడివాడ నియోజకవర్గ ప్రజల సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎవ్వరికీ భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. పాలంకి సోదరులతో పాటు గుడివాడ జనసేన నాయకులు సందు పవన్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలసిన వారిలో ఉన్నారు.