కొవాగ్జిన్‌ టీకా వాలంటీర్‌గా హర్యానా ఆరోగ్య మంత్రి

హర్యానాలో ప్రారంభం కానున్న భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ ‘తొలి వలంటీర్‌’గా నిలిచారు. మూడో విడత మానవ పరీక్షల కోసం వలంటీర్‌గా పేరు నమోదు చేసుకున్నట్లు ట్వీట్‌ చేశారు. హర్యానాలో, రోహ్తక్‌లోని పండిట్ భగవత్ దయాల్ శర్మ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఫరీదాబాద్‌లోని ఈఎస్ఐసీ హాస్పిటల్‌తో పాటు దేశంలోని 22 కేంద్రాల్లో సుమారు 26వేల మందిపై భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత ట్రయల్స్‌ టీకా ఉత్తమ ఫలితాలు ఇచ్చింది. దీంతో మూడో దశ ప్రయోగాల కోసం ఇటీవల భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోంది.