విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంలో విచారణ

తెలంగాణ, ఏపీ విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన విషయంలో జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యుత్‌ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల తరఫున న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపించారు. ఆర్థిక సమతుల్యత అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ఉద్యోగుల కేటాయింపులు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ స్థానికత కలిగిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఉద్యోగల విభజన విషయంలో తొలుత జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక చట్టబద్ధతను తేలుస్తామని.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేయడం సరైనదా? కాదా? అనేది నిర్ణయిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను ఈనెల 23వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. నేటి విచారణలో తెలంగాణ విద్యుత్‌ సంస్థల పిటిషన్లపై వాదనలు ముగిసిన సోమవారం నుంచి ఏపీ విద్యుత్ సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి.