కరోనా విజృంభణతో రష్యాలో మళ్లీ లాక్​డౌన్

 కోవిడ్‌ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుండి వారం రోజుల పాటు విధులకు హాజరు కాకుండా ఇళ్ళలోనే వుండాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం ప్రజలను కోరారు.. ఇప్పటివరకు వ్యాక్సిన్‌ వేసుకోని వారు వెంటనే టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరారు. గత 24గంటల్లో 1028మంది కరోనాతో మరణించారని ప్రభుత్వ కరోనా వైరస్‌ టాస్క్‌ ఫోర్స్‌ తెలిపింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అధిక సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే. దీంతో రష్యాలో మొత్తంగా మృతుల సంఖ్య 2,26,353కి చేరింది. మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి అక్టోబరు 30నుండి వారంరోజుల పాటు విధులకు హాజరు కాకుండా వుండేలా చూడాలంటూ కేబినెట్‌ చేసిన ప్రతిపాదనకు పుతిన్‌ మద్దతు తెలిపారు. ఆ వారంలో నాలుగు రోజుల పాటు శలవులే వున్నాయి. వీటిలో రెండు ప్రభుత్వ శలవుదినాలుగా వున్నాయి. పరిస్థితి మరింత తీవ్రంగా వున్న ప్రాంతాల్లో ఈ శనివారం నుండి నవంబరు 7వరకు విధులకు హాజరు కాకుండా చూడాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడడమన్నదే ఈనాటి ప్రధాన కర్తవ్యంగా వుంది. ప్రమాదకరమైన ఈ ఇన్ఫెక్షన్‌ పర్యవసానాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులతో పుతిన్‌ వీడియో కాల్‌ మాట్లాడారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే, ముందుగా వైరస్‌ వ్యాపించే వేగాన్ని తగ్గించడం అవసరమని అన్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు అదనపు నిల్వలుల సమీకరించుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆరోగ్య సంరక్షణ రంగం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆఫీసులకు హాజరు కావడాన్ని నివారించినట్లైతే, రద్దీగా వుండే ప్రజా రవాణా వ్యవస్థను ఆపగలిగితే పరిస్థితిని అదుపులోకి తేగలుగుతామని భావిస్తున్నారు. కేబినెట్‌ మంగళవారం ఈ మేరకు ప్రతిపాదన తీసుకురాగానే చాలామంది రష్యన్లు నల్ల సముద్రం రిసార్టులకు విమానాలను బుక్‌ చేసుకుంటున్నారు.