సీపీ సజ్జనార్‌ హెచ్చరిక.. ఇక పై పబ్ నిర్వాహకులదే బాధ్యత..

పబ్‌లకు వచ్చి అధిక మోతాదు లో మద్యం  సేవించిన వారు బయటకు వచ్చి వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత పబ్‌ నిర్వాహకులదేనని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తున్న వాహనదారులు రోడ్డు ప్రమాదాలు చేస్తూ.. డివైడర్‌లను, చెట్లను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోవడంతో పాటు.. నిర్ధాక్షిణ్యంగా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్‌లు, క్లబ్‌లు వద్ద నిర్వాహకులు అదనపు డ్రైవర్‌లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. మద్యం మత్తులో ఉన్నవారిని జాగ్రత్తగా ఇంటికి చేర్చడానికి ఈ డ్రైవర్‌లను ఉపయోగించాలన్నారు.

వెంటనే పబ్‌ల నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే పబ్‌లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటికే సైబరాబాద్‌ పరిధిలోని పబ్‌లకు నోటీసులు జారీ చేసినట్లు ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. డ్రంకెన్‌ డ్రైవ్‌, రోడ్డు ప్రమాదాలు, నివారణ, వాహనదారులు పాటించాల్సిన ట్రాఫిక్‌ నిబంధనలపై బుధవారం ఆల్‌ఇండియా రేడియో, ఎఫ్‌ఎం రెయిన్‌బో నిర్వహించిన లైవ్‌ కార్యక్రమంలో సీపీ సజ్జనార్‌, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ పాల్గొని ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఫోన్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.