ప్లాస్మా థెరపీతో ఫలితాలు కనిపించలేదన్న ఢిల్లీ ఎయిమ్స్

కొవిడ్ -19 రోగులలో మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం చూపించలేదని ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. ప్లాస్మా థెరపి చికిత్సా విధానం సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం జరిపిన ప్రయోగాలను విశ్లేషించిన అనంతరం ఈ ఫలితం తేలినట్టు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డా రణదీప్ గులేరియా స్పష్టంచేశారు.

30 కోవిడ్ -19 రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా యాంటిబాడీస్ ఎక్కించినప్పటికీ.. మరణాల రేటును నివారించడంలో స్పష్టమైన ఫలితాలు కనిపించలేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా గురువారం వెల్లడించినట్టు పీటీఐ పేర్కొంది.

ప్లాస్మా థెరపీ సమయంలో, ఒక సమూహంలోని రోగులకు యధావిధిగా ఇచ్చే కొవిడ్-19 చికిత్సతో పాటు ప్లాస్మా థెరపి చికిత్స కూడా ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మరొక సమూహంలోని రోగులకు కేవలం కొవిడ్-19 చికిత్సను మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ రెండు గ్రూపుల్లో నమోదైన మరణాల సంఖ్య సమానంగానే ఉందని, అలాగే ప్లాస్మా థెరపి తీసుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిలోనూ ఆశించినంత మెరుగుదల కనిపించలేదని డా గులెరియా తెలిపారు.