ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి సొంత విద్యా బోర్డు

న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల మాదిరిగా ఢిల్లీకి సొంత విద్యా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటును కేబినెట్‌ ఆమోదించినట్లు శనివారం ఆయన చెప్పారు. సీఈవో అధిపతిగా ఉండే ఈ బోర్డు రెండు విభాగాలుగా ఉంటుందని తెలిపారు. ఒకటి ఢిల్లీ విద్యా మంత్రి నేతృత్వంలోని పాలకమండలి, మరొకటి రోజువారీ విధులు పర్యవేక్షించే కార్యనిర్వాహక సంస్థ అని వివరించారు. పాలక, కార్యనిర్వాహక సంస్థల్లో విద్యా రంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు సంబంధించిన నిపుణులు ఉంటారని వెల్లడించారు.

2021-22 విద్యా సంవత్సరంలో ఢిల్లీలోని సుమారు 25 స్కూళ్లు ఈ బోర్డు పరిధిలోకి వస్తాయని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో సుమారు 1000 ప్రభుత్వ పాఠశాలలు, 1700 ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉన్నాయని చెప్పారు. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, చాలా వరకు ప్రైవేట్‌ స్కూళ్లు సీబీఎస్‌ఈ అనుబంధంగా ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో కొన్ని స్కూళ్లను సీబీఎస్‌ఈ బోర్డు నుంచి తొలగించి ఢిల్లీ స్కూల్‌ బోర్డుకు అనుసంధానం చేస్తామని కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీని కోసం సంబంధిత స్కూళ్ల ప్రిన్సిపాల్‌, టీచర్లతో చర్చలు జరుపుతామని తెలిపారు. మరో నాలుగైదు ఏండ్లలో ఢిల్లీలోని అన్ని స్కూల్స్‌ స్వచ్ఛందంగా ఢిల్లీ విద్యా బోర్డుతో అనుసంధానమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.