పి.వికి భారతరత్న ప్రకటించడం ఆనందదాయకం: ఉప్పు వెంకటరత్తయ్య

గుంటూరు, భారత మాజి ప్రధాన మంత్రి స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావుకి భారతరత్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించటం ఆనందదాయకం అని జనసేన పార్టి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య హర్షం వ్యక్తంచేశారు. ఆరోజుల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం కొనసాగించి ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని పరిపాలించిన తీరు అమోఘం అనిర్వచనీయం అని అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో జన్మించిన నరసింహారావు శాసనసభ్యునిగాను, పార్లమెంటు సభ్యుడుగాను, రాష్ట్ర మంత్రి గాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గాను, కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను నిర్వర్తించి భారత ప్రధానమంత్రిగా అనేక కీలకమైన నిర్ణయాలతోటి భారత దేశం ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నరసింహారావు అని వెంకటరత్తయ్య అన్నారు. బహుభాషా కోవిదుడుగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన మచ్చలేని రాజకీయ దురంధరుడు ఈ తెలుగు తేజం నరసింహారావు అని వెంకటరత్తయ్య శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు.