ఆగస్టు 15న పట్టాల పంపిణీ

ఇబ్రహీంపట్నం మండలం గాజులపేట గ్రామంలో 71వ వనమహోత్సవం కార్యక్రమాన్నిబుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమoలో బాగంగా పేదల ఇళ్ల స్థలాల కోసం లే అవుట్‌ చేసిన 33 ఎకరాల స్థలంలో మొక్కలు నాటారు. అనంతరం సీఎం ప్రసంగించారు. ‘దేవుడి ఆశీర్వాదంతో ఆగస్టు 15న పట్టాల పంపిణీ ద్వారా పేదలకు స్వాతంత్య్రం వస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున 30 లక్షల మంది పేదలకు దేవుడు స్వాతంత్య్రం ఇస్తాడు’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేద్దామంటే టీడీపీ కేసుల ద్వారా ఆటంకాలు సృష్టిoచగా… ఆ పార్టీ చేస్తున్న అన్యాయపు పనుల వల్ల ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 వేల పంచాయతీల్లో 33 వేల ఎకరాల్లో పేదల కోసం స్థలాలను లే అవుట్‌ చేశామన్నారు. గాజులపేటలోని 33 ఎకరాల లే అవుట్‌ చాలా అందంగా, అద్భుతంగా ఉందన్నారు. ఏడాదిలో మొత్తం 20 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలతో వనమహోత్సవ ప్రతిజ్ఞను చేయించారు.