జిల్లాల ప్రతిపాదన కేవలం స్వార్దం తోకూడిన రాజకీయ వ్యాపారము: తాతంశెట్టి నాగేంద్ర

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జిల్లాల విభజనపై పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఒక హెడ్ క్వార్టర్ ఎన్నిక చేసేముందు అక్కడ భోగోలిక, నీటి వసతి ప్రధానంగా పరిశీలిస్తారు. అలాంటిది రాజంపేట జిల్లాకు పద కవితా పితామహుడు అన్నమయ్య పేరుపెట్టి ఆయన నడయాడిన ఊరులో కాకుండా రాయచోటిని జిల్లా ప్రకటించడం దారుణమని తీవ్రంగా ఖండించారు. తిరుపతి కడప హై వే , ఎటు గంట ప్రయాణం చేసినా ఎయిర్ పోర్ట్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళగలిగె సౌకర్యం ఉన్న రైల్వే మార్గము మరియు ఆంధ్ర అయోధ్య గా పేరుగాంచిన ఏకశిలానగరం ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాదాలయం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన మంగపేట ముగ్గురాళ్ళ గనులు ఇలా ఎన్నో చరిత్ర కలిగిన అంశాలు రాజంపేటకు కూత వేటు దూరంలో పెట్టుకుని రాయచోటిని ప్రతిపాదించడం కేవలం స్వార్దం తోకూడిన రాజకీయ వ్యాపారము అని దీనిని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాజంపేట, రైల్వే కోడూరు ప్రజల మనోభావాలతో పని లేకుండా తీసుకున్న ఈ చర్యను పార్టీలకు అతీతంగా ఖండించాలని, రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ గా వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. మా మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంకు మళ్లీ అన్నమయ్య పేరు ఎందుకని శ్రీకాంత్ రెడ్డి తండ్రి పేరు పెట్టుకోకూడదా అని ఎద్దేవా చేశారు. అయినా ఇది జరిగే పని కాదని ప్రాంతాల మధ్య చిచ్చు రాజేసి సమస్యల నుంచి దారి మళ్లించి చలి కాచుకోవాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఈ ప్రభుత్వ దమన నీతిని ప్రతి రోజూ ఎండగడుతూ ప్రజా పోరాటానికి సిద్దపడతామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తెలియజేశారు.