శివుడిని సోమవారం ఎందుకు పూజిస్తారో తెలుసా.. ? చంద్రుడి శాపం పోగొట్టిన శివుడి వరం..?

శివుడికి సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు అనే సంగతి శివుడిని ఆరాధించే వాళ్లందరికీ తెలిసిన విషయమే. ప్రతీ రోజు శివుడిని ఆరాధించి, ప్రార్థించే అవకాశం ఉన్నప్పటికీ.. సోమవారం నాడు శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా ఆ పూజా ఫలం లభిస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకు కారణం ఏంటి ? ఈ విశ్వాసం వెనుక ఉన్న కథా, కమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హిందీలో సోమ్ అంటే చంద్రుడు అని అర్థం.

సోమవారం చంద్రుడికి బాగా ప్రీతిపాత్రమైన రోజు అన్నమాట. చంద్రుడికి, శివుడికి మధ్య సోమవారం గురించి ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దక్ష మహా రాజుకి చెందిన 27 మంది దత్తపుత్రికలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఆ 27 మంది భార్యలు ఆకాశంలో చంద్రుడి చుట్టూ 27 తారల వలె ప్రతిభింబిస్తుంటారు.

చంద్రుడు 27 మందిని పెళ్లి చేసుకున్నప్పటికీ రోహినికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆమెపైనే ఎక్కువ దృష్టి సారించడం మిగతా వారికి నచ్చకపోవడంతో వారు తమ తండ్రి అయిన దక్ష మహారాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. చంద్రుడి వైఖరి గురించి తెలుసుకున్న దక్ష మహారాజు వచ్చి అల్లుడైన చంద్రుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. చంద్రుడి వైఖరిలో మాత్రం ఏ మార్పు లేకపోవడంతో ఆగ్రహించిన దక్ష మహారాజు, చంద్రుడికి ఓ శాపం పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.
చంద్రుడికి దక్ష మహారాజు శాపం ఏంటంటే..
దక్ష మహారాజు శాపం కారణంగా చంద్రుడు క్రమక్రమంగా పరిమాణం తగ్గి, తన ప్రభను, స్వయంప్రకాశిత శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తాడు. దీంతో తన ఉనికికే ప్రమాదం వస్తోందని గ్రహించిన చంద్రుడు వెంటనే వెళ్లి ఆ బ్రహ్మ దేవుడిని కలిసి మొరపెట్టుకుంటాడు. తన సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాల్సిందిగా వేడుకుంటాడు. చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ.. ఈ విషయంలో ఆ మహా శివుడే నీకు సాయం చేయగలడని, ఆయన్ని ప్రార్థించి ప్రసన్నం చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు.

శివుడిని ప్రార్థించిన చంద్రుడు
బ్రహ్మ సూచనల మేరకు శివుడిని ఆరాధించడం మొదలుపెట్టిన చంద్రుడు.. శివుడు ప్రసన్నం అయ్యే వరకు తన ప్రార్థన కొనసాగిస్తాడు. చంద్రుడి భక్తికి మెచ్చి అతడి ఎదుట ప్రత్యక్షమైన శివుడు.. చంద్రుడి సమస్యను తెలుసుకుని అతడు తిరిగి తన శక్తిని పొందే వరం ఇస్తాడు. కానీ అప్పటికే దక్ష మహారాజు శాపం ప్రభావంతో ప్రభను కోల్పోయి ఉండటంతో నెలలో పదిహేను రోజులు క్రమంగా నశిస్తూ అమావాస్య నాటికి చంద్రుడు తన శక్తిని కోల్పోగా.. శివుడి వరం కారణంగా తిరిగి క్రమక్రమంగా తన శక్తిని పొందుతూ పౌర్ణమి నాటికి నిండు చంద్రుడి వలె దేదీప్యమానంగా వెలుగుతుంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలా చంద్రుడుని శివుడిని కాపాడిన కారణంగానే ఆ శివుడిని సోమ్‌నాథ్ అని, చంద్రశేఖరుడు అని పిలుస్తుంటారని పురాణగాథలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఎవరైతే సోమవారం నాడు ఆ పరమశివుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో.. వారిని చంద్రుడి లాగే తమ కష్టాల్లోంచి గట్టెక్కించి తిరిగి శక్తిని పొందే మార్గం చూపిస్తాడని పురాణాలను అవపోసన పట్టిన పండితులు చెబుతుంటారు.