గచ్చిబౌలిలో కంపించిన భూమి.. భారీ శబ్ధాలు..!

గత మూడు రోజులుగా భారీ వర్షాలతో బిక్కుబిక్కుమంటూ గడిపిన హైదరాబాద్‌ నగరవాసులను భూకంపం వణికించింది. గచ్చిబౌలి టీఎన్టీవోస్‌ కాలనీవాసులు.. భూ ప్రకంపనలు, భారీ శబ్దాలతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి భూప్రకంపనల కారణంగా ఇండ్లలో వస్తువులు కదలడం, గేట్లు, ఆరుబయట సామగ్రి ఊగడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జోరువాన సైతం లెక్కచేయకుండా రోడ్డుపై, ఇండ్ల బయట ఉండిపోయారు కాలనీవాసులు. అయితే తెల్లవారుజామున శబ్దాలు ఆగిపోవడంతో తిరిగి ఇండ్లలోకి వెళ్లారు. అధికారులకు సమాచారం ఇచ్చామని కాలనీవాసులు తెలిపారు. అయితే, అధికారులు మాత్రం భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం మాత్రం అందలేదు.