చదువుకున్నవాళ్లే హింసను ప్రేరేపిస్తున్నారు..

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సం ఇవాళ జరుగుతోంది. ఆ వేడుకల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ప్రేరణాత్మకంగా, సంతోషంగా ఉందన్నారు. నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొనుంటే బాగుండేదని, కానీ కోవిడ్ వల్ల అక్కడికి రాలేకపోయినట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్నవారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్నవారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారన్నారు. మరోవైపు హాస్పిటళ్లు, ల్యాబ్‌ల్లో ఉన్న అనేక మంది మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను రిస్క్‌లోకి నెట్టేస్తున్నారన్నారు. ఇది ఐడియాలజీకి సంబంధించిన అంశం కాదు అని, ఇది మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశమని ప్రధాని తెలిపారు.

మీరు ఏది చేసినా.. అది మీ మైండ్‌సెట్ పాజిటివ్‌గా ఉందా లేక నెగటివ్‌గా ఉందా అన్న అంశంపై ఆధారపడుతుందన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఆ రెండు అంశాలు ఎదురవుతుంటాయని, కానీ సమస్యలు సృష్టించాలా లేక పరిష్కరించాలా అన్న అంశాన్ని ఎన్నుకునేది మన చేతుల్లో ఉంటుందని ప్రధాని తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం.. ఆత్మనిర్బర్ భారత్‌కు కీలకమైన అడుగు అన్నారు. ఆ విద్యావిధానం ద్వారా పరిశోధన, ఆవిష్కరణలు పెరుగుతాయన్నారు. కొత్త విద్యావిధానంతో మన దేశం విశ్వగురువుగా మారుతుందని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ తెలిపారు. విద్యా సంస్కరణల్లో ఈ స్కీమ్‌ గేమ్‌చేంజర్‌గా పనిచేస్తుందని ఆయన అన్నారు.