సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి.. ప్రభుత్వానికి ఈటల సవాల్!

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదనపూరితంగా స్పందించారు. తన హాచరీస్ కోసం రైతుల వద్ద నుంచి తీసుకున్న భూముల పత్రాలు ఇప్పటికీ ఎమ్మార్వో దగ్గరే ఉన్నాయని ఈటల తెలిపారు. వాటిని చూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. ధర్మం లేకపోతే వ్యాపారంలో తాను వంద కోట్లకు ఎదిగేవాడిని కాదని అన్నారు. తన జీవితంలో ఒకరి ఆస్తిని కూడా లాక్కోలేదని, ఒకరిని కూడా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో కరీంనగర్ ప్రజలకు తెలుసని అన్నారు. తన భూములు పోయినా పర్వాలేదని… ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోనని చెప్పారు.

తాను ముదిరాజ్ కులంలో పుట్టానని… తనది భయపడే జాతి కాదని ఈటల అన్నారు. చిల్లరమల్లర మాటలకు తాను భయపడనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాత్రికి రాత్రే ఎందరో కోట్లకు పడగలెత్తారని, స్కూటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి వందల కోట్లకు ఎలా పడగలెత్తారని ఈటల ప్రశ్నంచారు. తనకు అందరి చరిత్రలు తెలుసని, అయితే ఎవరి పేర్లను తాను బయటపెట్టదలుచుకోలేదని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని చూసుకున్న చరిత్ర తనదని చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలపై అన్ని విచారణ సంస్థలతో పాటు, సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. తాను తప్పు చేసినట్టు ఒక్క విచారణలో తేలినా… ఏ శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు.