హిమాలయ పర్వత శ్రేణుల్లో 11 మంది పర్వతారోహకులు మృతి

ఉత్తరాఖండ్‌లో పెను విషాదం నెలకొంది. ఇక్కడ ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో తప్పిపోయిన 11 మంది పర్వతారోహకులు చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కనిపించకుండాపోయిన మరో ఆరుగురి కోసం లాంఖగా పాస్‌పై భారత వైమానికి దళం గాలింపు చర్యలు చేపట్టింది. పర్వతారోహకులు, పర్యాటకులు, పోర్టర్లు, గైడ్‌లతో కూడిన 17 మంది ఈనెల 14న హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా నుంచి ఉత్తరాఖండ్‌లోని ఉత్కర్షికి వెళ్లారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ హిమపాతం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని లాంఖగా పాస్‌ వద్ద వారు దారి తప్పారు. ఈ క్రమంలో వీరి కోసం పోలీసులు, భారత వైమానిక దళం గాలింపు చర్యలు చేపట్టారు.

సముద్ర మట్టం నుంచి 17 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న లాంఖగా పాస్‌పై వారు చిక్కుకున్నట్టు గుర్తించారు. దీంతో అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్లను వాయుసేన రంగంలోకి దింపి, సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 11 మంది మృతదేహాలను గుర్తించారు. 16800 ఫీట్ల ఎత్తులో ఉన్న వారి మృతదేహాలను కిందికి తీసుకొచ్చేందుకు వైమానిక దళం యత్నాలు చేస్తోంది. అదేవిధంగా తప్పిపోయిన మరో ఆరుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.