వర్షాలకు నీట మునిగిన ఏలూరు ఆసుపత్రి

ఏలూరు నియోజవర్గానికి అసమర్థుడైన ఎమ్మెల్యే ఉండటం వల్లే భారీ వర్షాలకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నీట మునిగిందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు ఏలూరు ఆసుపత్రిలోకి భారీగా చేరిన వర్షపు నీటిని జనసైనికులతో కలిసి మంగళవారం రెడ్డి అప్పలనాయుడు బయటకు తోడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని, భారీ వర్షాలు కురిస్తే ఆసుపత్రి నీట మునుగుతుందని తెలిసినప్పటికీ ఏలూరు ఎమ్మెల్యే ఏ విధమైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆయన నైజానికి అద్దం పడుతుందన్నారు. జిల్లాలోని 40 గ్రామాల నుంచి రోగులు ఏలూరు ఆసుపత్రికి వస్తుంటారని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వర్షపు నీరు ఆసుపత్రిలోకి వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయక పోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి ఆసుపత్రిలోకి చేరిందని, ఈ కారణంగా వైద్యులు, రోగులతో పాటు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిపించిన ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా నిద్ర వస్తువులో ఉంటున్న ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుకు చివరి రోజులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. నిధులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్న అసమర్థులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో భారీగా చేరిన వర్షపు నీటిని పూర్తిస్థాయిలో బయటికి తోడిచివేయాలని, మళ్లీ వర్షపు నీరు చేరకుండా తక్షణం డ్రైన్లలో మురుగు తీయాలని, బయట నీరు ఆసుపత్రిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ నాయకులు వీరంకి పండు రెడ్డి గౌరీ శంకర్ రాపర్తి సూర్యనారాయణ జనసేన రవి మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.