ఆక్రమణలు అరికట్టాలి.. పేడాడ రామ్మోహనరావు

ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని అధికార వైసీపీ పార్టీ నాయకులు కూరగాయల మార్కెట్ వద్ద ఆక్రమించుకుని ఏర్పాటుచేసిన బడ్డీలను వెంటనే తొలగించాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహనరావు అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం జనసైనికులతో కలిసి ఆక్రమణకు గురైన కూరగాయల మార్కెట్ ముందర ఏర్పాటు చేసిన బడ్డీలను పరిశీలించారు. ఇక్కడే గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని నాయకుల అనుచరులు బడ్డీలు ఏర్పాటు చేయడంతో తమను అక్కడ నుండి దూరంగా వెళ్లిపోవాలని ఆదేశిస్తూ బెదిరిస్తున్నారని వర్తకులు ఆయన ముందు వాపోయారు. అనంతరం పాలబంద చెరువు వద్ద ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి – టిడిపి రెండు పార్టీలు ఒకే తాను ముక్కలని మామా అల్లుళ్లు కలసి ప్రభుత్వ స్థలాలను తమ అనుచరులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డుపైనే పొట్టకూటి కోసం తోపుడు బళ్ళు తో వ్యాపారం చేసుకుంటూ తమ జీవనాన్ని గడుపుతున్న పేదల పొట్ట కొట్టి వైసీపీ అనుచరులకు బడ్డీలను కట్టబెట్టడం సమంజసం కాదని వెంటనే తొలగించి పేదలకు ఆ బడ్డీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు సగానికి సగం కబ్జాకు గురయ్యాయని భావితరాలు ఎలా బ్రతకాలని అధికారులను ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో వైసిపి టిడిపి పార్టీలను తరిమికొట్టాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు స్పందించి బడ్డీ లను తొలగించకపోతే తాము కూడా బడ్డీలను ఖాళీ స్థలాలలో పెట్టుకుంటామని హెచ్చరించారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ కె. అప్పలనాయుడుకు వినతి  పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు గణేష్, కోటి, తవిటి నాయుడు, గోవింద్, రాము, రాజు, ఫణి పాల్గొన్నారు.