ఎస్తేరు రాణిది వైసీపీ ప్రభుత్వం చేసిన హత్యే: ఆళ్ళ హరి

  • ముఖ్యమంత్రి నివాసం పక్కనే హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర పరిస్థితి ఏమిటి?
  • గంజాయి మత్తులో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారు
  • రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలకు అడ్డాగా మార్చారు
  • తమ దాష్టీకాలను ప్రశ్నించకుండా రాష్ట్ర యువతను మాదకద్రవ్యాల మత్తులో జోగాడేలా చేస్తున్నారు
  • పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని లా అండ్ ఆర్థర్ ని నిర్వీర్యం చేశారు
  • బటన్ నొక్కటం, రంగులు వేయటం, స్టిక్కర్లు అతికించటమే పరిపాలన అనుకుంటున్నారు
  • వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు
  • గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో అంధురాలైన ఎస్తేరు రాణి అనే అమ్మాయిని రాజు అనే యువకుడు గంజాయి మత్తులో దారుణంగా నరికి హత్య చేయటం ప్రభుత్వ అసమర్ధ పాలనకు నిదర్శనమని, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అరికట్టలేని ప్రభ్యత్వమే రాణి హత్యకు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాస ప్రాంతానికి దగ్గరలో అదీ జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ హత్య జరగటం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా, లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్కపొడి ప్యాకెట్లు దొరికినంత సులువుగా బడ్డి కొట్లలో సైతం గంజాయి పొట్లాలు దొరుకుతున్నాయని, అయినా పోలీసులు, అధికారులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా డ్రగ్స్ రహిత ఆంద్రప్రదేశ్ అంటూ ప్రచారం చేసుకుంటే సరిపోదని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటుంది చాలక కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలే ఈ మాదకద్రవ్యాలను, నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిలో, సంక్షేమంలో మొదటిస్థానం సంపాదించకపోయిన మాదకద్రవ్యాల వాడకంలో మాత్రం రాష్ట్రాన్ని దేశంలోనే ప్రదమస్థానంలో నిలబెట్టిన ఘనత వైసీపీ నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కటం, రంగులు వేయటం, స్టిక్కర్లు అతికించటమే పరిపాలన అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగణాసుర పాలన అంతమై వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్నారు. చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన ప్రజలకు సుపరిపాలన అందించటంలో వైసీపీ నేతలు నాలుగేళ్ళుగా పూర్తిగా విఫలమవుతూనే ఉన్నారన్నారు.
రాణి లాంటి మరో అమ్మాయిని కోల్పోకుండా వైసీపీ ప్రభుత్వం గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. హత్యకు పాల్పడి పరారీలో ఉన్న హంతకుడు రాజుని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆళ్ళ హరి కోరారు.