సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్‌

కైరో: గత వారం రోజులుగా సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన ఎవర్ గివెన్ షిప్ సోమవారం కదిలింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు ఆ షిప్ తిరిగి నీటిపై తేలడం ప్రారంభించిందని ఇంచ్‌కేప్ షిప్పింగ్ సర్వీసెస్ తన ట్విటర్‌లో వెల్లడించింది. ఇక ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్న ఆ షిప్‌ను టగ్ బోట్ల సాయంతో మళ్లీ దారిలోకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరలోనే సుయెజ్ కాలువను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షిప్ వల్ల ఇప్పటికే కాలువలో అటుఇటూ కొన్ని వందలాది నౌకలు నిలిచిపోయాయి.

షిప్ ట్రాకింగ్ సర్వీస్ అయిన వెసెల్‌ఫైండర్ సుయెజ్ కాలువలోని ఎవర్ గివెన్ షిప్ స్టేటస్‌ను మార్చింది. ప్రస్తుతం ఆ కంటైనర్ షిప్ కదులుతున్నట్లుగా చెప్పింది. గత మంగళవారం 400 మీటర్ల పొడువున్న ఈ షిప్ సుయెజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఈదురు గాలుల కారణంగా ఈ షిప్ అడ్డం తిరిగింది. షిప్ తిరిగి పాక్షికంగా నీటిలో తేలినట్లు ఈజిప్ట్ అధికారులు తెలిపారు. సుయెజ్ కెనాల్ అథారిటీ దీనిని ధృవీకరించాల్సి ఉంది.