ప్రతి రోజూ పండగే: శ్రావణమాసం

ఆధ్యాత్మికంగా ఏంతో ప్రాశస్త్యం సంతరించుకున్న శుభ శ్రావణమాసం మొదలైంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చంద్రమానాన్ని అనుసరించి తెలుగు నెలల క్రమంలో శ్రావణం ఐదో మాసం. ఈ మాసంలో ప్రతి ఇల్లు నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మ్రోగుతుంది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు మరియు వరలక్ష్మి, గౌరీ దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో వచ్చే పండుగలకు చాలా ప్రత్యకత ఉంది. తిథులతో ఏమాత్రం సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.

ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు, ప్రత్యేకతలు…

శివారాధనకు విశిష్టత:

 శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని పెద్దలు చెబుతారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాడంగా నమ్ముతారు.

మంగళ గౌరీ వ్రతం:

శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవారవ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ రోజున గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ, పూలు అక్షింతలతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా వివాహమైన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మంచి భర్త లభించాలని అవివాహితులు,  సౌభాగ్యం మరియు తమ వైవాహిక బంధం సజావుగా  అష్టైశ్వర్యాయురారోగ్యాలతో సాగాలని వివాహితులు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.

వరలక్ష్మీ వ్రతం:

శ్రావణ మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మి దేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేయిస్తారు. వరాలిచ్చే దేవత వరలక్ష్మీ వ్రతం వల్ల భర్తలకు ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుష్షు కలుగుతాయని విశ్వాసం. పురాణాల ప్రకారం చారుమతి దేవి అనే భక్తురాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను పొందిందని ప్రసిద్ధి.

నాగ చతుర్థి:

శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగ చతుర్థి. శివుడి కంఠాభరణమైన నాగేంద్రుడిని పూజించడం హైందవ సాంప్రదాయంగా భావిస్తారు. పాలు,  పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు కూడా పోస్తారు.

కృష్ణాష్టమి:

శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలలో వర్ణించబడింది. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు.

శ్రావణ పౌర్ణమి:

శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీతధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.

పుత్రాదా ఏకాదశి :

సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రదా ఏకాదశి అన్నారు.

కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వీటితోపాటు గరుడ పంచమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, దామోదర ద్వాదశి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం శ్రావణమాసంలోనే రావడంతో ఎంతో విశిష్టతను సంతరించుకుంది ఈ శ్రావణమాసం. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన పూజలు, వ్రతాలు, నియమాలు, ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

.