క్వాడ్‌ గురి అంతా చైనాపైనే

వైట్‌ హౌస్‌లో శిఖరాగ్ర సదస్సువాషింగ్టన్‌ : చైనాను లక్ష్యంగా చేసుక్ను క్వాడ్‌ దేశాల కూటమి బలవంతపు చర్యల ద్వారా నిరోధించలేని స్వేచ్ఛా, పారదర్శక ఇండో-పసిఫిక్‌ ప్రాంతమే తమ లక్ష్యమని చెప్పింది. నాలుగు దేశాల నేతలు మొదటిసారిగా ముఖాముఖిగా జరిపిన ఈ తొలి సమావేశంలో చైనా పట్ల తమ ఆందోళనను వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశాన్ని చైనా నిశితంగా గమనిస్తోంది. ”చట్టబద్ధ పాలనకు, స్వేచ్ఛగా నౌకల, విమానాల రాకపోకలకు, వివాదాల శాంతియుత పరిష్కారానికి, ప్రజాస్వామ్య విలువలకు, దేశాల ప్రాదేశిక సమగ్రతలకు మేం కట్టుబడి వున్నాం” అని క్వాడ్‌ నేతలు ప్రకటించారు. చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని యోషిడె సుగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసే సమయంలో, సుదీర్ఘమైన సంయుక్త ప్రకటనలో చైనాను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా కానీ వారి దృష్టిలో చైనా వున్నదనే అంశం స్పష్టమై పోతోంది. ”ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో, వెలుపల భద్రత, సంక్షేమాన్ని పెంపొందించేందుకుగానూ స్వేచ్ఛ, పారదర్శకమైన నిబంధనల ప్రాతిపదికగా వుండే వ్యవస్థను ప్రోత్సహించేందుకు మేం కట్టుబడి వున్నామని” ఆ ప్రకటన పేర్కొంది. చిన్న దీవుల దేశాలకు ముఖ్యంగా పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలకు క్వాడ్‌నేతలు మద్దతు ప్రకటించారు. వారి ఆర్థిక, పర్యావరణ సామర్ధ్యాలను పెంపొందించేందుకు తోడ్పాటు వుంటుందని తెలిపారు. అణ్వాయుధాల విషయంలో చర్చలు జరపాల్సిందిగా ఉత్తర కొరియాను కోరారు. అక్టోబరులో ఎగుమతులు పునరుద్ధరించాలన్న భారత్‌ ప్రణాళికను స్వాగతించారు. సమావేశం అనంతరం సుగా విలేకర్లతో మాట్లాడుతూ, వ్యాక్సిన్ల విషయంలో సహకారానికి దేశాలు అంగీకరించాయన్నారు. వ్యాక్సిన్‌ ఎగుమతులను పునఃప్రారంభించిన తర్వాత కొవాక్స్‌ ఇంటర్నేషనల్‌కు వ్యాక్సిన్ల పంపిణీకి ప్రాధాన్యతనిస్తామని మోడీ చెప్పారు.

పలు ఒప్పందాలను ప్రకటించిన క్వాడ్‌

సెమీ కండక్టర్ల సరఫరాకు భద్రతతో సహా పలు ఒప్పందాలకు క్వాడ్‌ ఆమోదం తెలిపింది. అక్రమ చేపల వేటను అరికట్టడం, 5జి భాగస్వామ్యం, వాతావరణ మార్పులను కనిపెట్టే ప్రణాళికలపె ఒప్పందాలు కుదిరాయి.