మిచౌంగ్ తుఫాను నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్ద జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, పట్టణ అధ్యక్షులు జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రెడ్డెమ్మ, నవాజ్, జనార్దన్ తదితరులతో కలిసి వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.‌ ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ ‌ తుపాను తీవ్ర నష్టాలను మిగిల్చిందని, పంటలపై తీవ్ర ప్రభావం చూపి, రైతుల వెన్ను విరిచిందని వ్యక్తంచేశారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కొనసాగుతున్నాయని అన్నారు. రైతులు పొలాల్లోని పంట పరిస్థితిని చూసి రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారని వివరించారు. మదనపల్లె నియోజకవర్గంలో టమోటా, వరి, ఇతర వాణిజ్య పంటలు పండిస్తున్న రైతులు అపార నష్టం చవి చూశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలలో వరి, బొప్పాయి, అరటి, జొన్న, మొక్కజొన్న, రాగి తోపాటు వంకాయ, టమోటా, బెండ, బీన్స్ తదితర కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతోటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాజంపేట, రాయచోటి, కోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో అపార నష్టం వాటిల్లిందన్నారు. సాగు చేసిన పంటలో 80 శాతం పైగా నష్టం వాటిల్లిందన్నారు.‌ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా తూ తూ మంత్రంగా రిపోర్ట్ రెడి చేసి ఇవ్వకుండా క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ‌ పాడైపోయిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కోత కోసిన పంట వర్షాలకు తడిచి పాడైపోయిందన్నారు.‌ ఇప్పటికే కళ్లాల్లో ఉన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యం వహించడం వల్ల వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని అన్నారు‌. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అందించి రైతులను ఆదుకోవాలని, వర్షం నీటిలో పంట కొట్టుకుపోయిన ప్రాంతాల్లో రైతులకు ప్రభుత్వం పంటనష్ట పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. రైతులకు జరిగిన నష్టాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, రూరల్ ప్రధాన కార్యదర్శి నవాజ్, కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.