పంజాబ్‌లో భాజపా ఎమ్మెల్యేపై రైతుల దాడి

పంజాబ్‌లోని అబోహర్‌ శాసనసభ్యుడు అరుణ్‌ నారంగ్‌పై శనివారం రైతులు దాడికి పాల్పడ్డారు. కొంతమంది ఎమ్మెల్యే మీదపడి దుస్తులను పీలికలు చేశారు. ముక్తసర్‌ జిల్లాలోని మాలోట్‌ పట్టణంలో శనివారం ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనలో పంజాబ్‌ రాష్ట్రం కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక భాజపా ప్రజాప్రతినిధులపై కొంతకాలంగా రైతులు ఆగ్రహంగా ఉన్నారు. శనివారం మీడియా సమావేశం పెట్టేందుకు స్థానిక నేతలతో కలిసి అరుణ్‌ నారంగ్‌ మాలోట్‌కు చేరుకోగానే.. కొందరు రైతులు చుట్టుముట్టి నేతలపై, వారి వాహనాలపై నల్లని సిరా చల్లారు. ఎమ్మెల్యేను పక్కకు తీసుకువెళ్లినా వదలకుండా వెంటబడిన రైతులు దాడి చేసి, దుస్తులు చింపి పీలికలు చేసినట్టు పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో శాంతిభద్రతల వైఫల్యానికి ఇది నిదర్శనమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నంలో ఫరీద్‌కోట్‌ ఎస్పీ గాయపడి ఆసుపత్రిలో చేరారు.

శాసనసభ్యుడిపై దాడిని పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా సైతం ఈ దాడి బాధాకరమని ఖండిస్తూ.. భాజపా, దాని మిత్రపక్షాలే దీనికి బాధ్యత వహించాలని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.