సాగునీటి నిల్వ వనరులపై దృష్టి సారించండి..!

  • వర్షాలు కురవకముందే చెరువులకు మదుములు, చపటాలు, కానాలు, షట్టర్లుకు మరమ్మతులు చేపట్టాలి
  • డి. ఆర్.డి. ఏ. పీడీని కోరిన ఉత్తరాంధ్ర చెరువులు పరిరక్షణ జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: సాగునీటి నిల్వ వనరులు చెరువులు, గెడ్డలు, చెక్ డ్యామ్ లు, వ్రిజర్వాయర్లు తదితర వాటిపై దృష్టి సారించాలని
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పార్వతిపురం మన్యం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు. సోమవారం ఆ సమితి మండల అధ్యక్షులు బలగ శంకర్రావు, పట్టణ అధ్యక్షులు శిగడం భాస్కర రావుతో కలిసి పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జగన్ అన్నకు శబ్దం కార్యక్రమంలో భాగంగా డిఆర్డిఏ పిడి పెద్దింటి కిరణ్ కుమార్ ను కలిసి జిల్లాలోని చెరువులు, గెడ్డలు రిజర్వాయర్ల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి కొద్ది రోజుల్లో నైరుతి పవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని, వర్షాలు కురిసే సమయానికి పార్వతీపురం మన్యం జిల్లాలోని చెరువుల నిండా నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఆయా చెరువులు, గెడ్డలు, చెక్ డ్యామ్ లు, రిజర్వాయర్లు కు సంబంధించిన మధుములు, కానాలు, చపటాలు, షట్టర్లు తదితర వాటికి మరమ్మత్తులు చేపట్టాలన్నారు. అలాగే ఎక్కడైనా చెరువుగట్టు బలహీనంగా ఉంటే వాటిని బలంగా తీర్చిదిద్దాలన్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వర్షాధారంపై వ్యవసాయం చేస్తున్న రైతులకు వర్షాలు ఒకవేళ ఎడపెట్టినా చెరువుల్లో నీరు ఉంటే పంటలు పండించేందుకు భరోసా కలుగుతుందన్నారు. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వర్షాలు రాకముందే జిల్లాలోని చెరువుల అన్నింటి యొక్క కానాలు, మదుములు చపటాలు, షట్టర్లను పరిశీలించి అవసరమైన చోట మరమ్మత్తులు చేపట్టి, అవసరం ఉన్న చోట కొత్తవి ఏర్పాటు చేసే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అందజేశారు.