మాజీ మంత్రి చందులాల్ కన్నుమూత.. సంతాపం తెలిపిన కేసీఆర్‌

తెలంగాణ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు మార్పిడి చేసినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. గత కొద్ది రోజులుగా ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. 10 రోజుల నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. అజ్మీరా చందులాల్ స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా జగ్గన్నపేట. ప్రస్తుతం ఇది ములుగు జిల్లా పరిధిలో ఉంది. 1954 ఆగష్టు 17న చందులాల్ జన్మించారు. ఆయనకు భార్య,కుమారుడు,ముగ్గురు కుమార్తెలున్నారు. ఎన్టీఆర్,కేసీఆర్ హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

చందూలాల్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్పంచ్‌ నుంచి చందూలాల్‌ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్లు చెప్పారు. ములుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్‌ ఎంపీగా రెండు సార్లు గెలుపొందారని అన్నారు. అలాగే పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, పార్టీకి మంత్రిగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. ఆయన సుదీర్ఘకాలం పాటు గిరిజన నేతగా, గిరిజన సంక్షేమ మంత్రిగా చేసిన సేవలు మరువలేనవని అన్నారు.