అయోధ్య మసీదుకు జనవరి 26న శంకుస్థాపన

బాబ్రీ మసీదు బదులు అయోధ్యలో నిర్మించనున్న నూతన మసీదుకు జనవరి 26న శంకుస్థాపన చేయనున్నారు.. ఇందుకు సంబంధించిన నిర్మాణ ప్రణాళిక శనివారం విడుదల కానుంది. దీనిని జామియా మిలియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌.ఎం.అక్తర్‌ రూపొందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మసీదు నిర్మాణానికి ప్రభుత్వం సొహావెల్‌ తాలూకా ధన్నీపుర్‌ గ్రామంలో అయిదెకరాల స్థలం ఇచ్చింది. పనులను పర్యవేక్షించడానికి సున్నీ వక్ఫ్‌ బోర్డు ఆరు నెలల క్రితం 15 మంది సభ్యులతో ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. ఏడు దశాబ్దాల క్రితం గణతంత్ర దినోత్సవానే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, అందుకే అదే రోజున పునాది రాయి వేయాలని నిర్ణయించామని ఐఐసీఎఫ్‌ కార్యదర్శి అథర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఇక్కడ మసీదుతోపాటు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, సామూహిక వంటశాల, గ్రంథాలయాన్ని నిర్మిస్తారు. ఒకేసారి రెండు వేల మంది నమాజ్‌ చేసుకోవడానికి సౌకర్యాలు ఉంటాయి.