ప్రారంభమైన నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పలు కీలక బిల్లులపై చర్చ జరుగనుంది. అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అజెండాలోని మూడు అంశాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో భాగంగా ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లు, నగదు బదిలీ, కరోనా కట్టడిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై సభలో చర్చించనున్నారు. ఇక శాసన మండలిలో నేడు పోలవరం ప్రాజెక్టు, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలు సహా 9 బిల్లులపై చర్చ జరగనుంది.

కాగా, గత మూడు రోజులుగా అధికార, విపక్షాల వాగ్వివాదాలతో చలికాలంలోనూ వేడీ పుట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీనేతల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో సభ దద్దరిల్లింది. వరుసగా మూడు రోజులపాటు ప్రతిపక్షాల నేతలు సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. సభా కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తున్నారని పలుమార్లు స్పీకర్‌తో పాటు సీఎం జగన్ సూచించినప్పటికీ టీడీపీ నేతలు గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.