కరోనా నేపథ్యంలో పేదలకు ఉచితంగా కేంద్రం ఆహార ధాన్యాల పంపిణీ

దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో ఉపాధి లేక పేదలు అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో లాక్ డౌన్ విధించిన సమయంలోనూ కేంద్రం ఇలాగే రేషన్ దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేసింది. తాజాగా, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద మే, జూన్ మాసాల్లో ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నారు. 80 కోట్ల మంది పేదలకు 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేయనున్నారు. ఆహార ధాన్యాల కోసం కేంద్రం రూ.26 వేల కోట్లు ఖర్చు చేయనుంది.

భారత్ లో గతంలో కంటే ఈసారి కరోనా వ్యాప్తి అత్యంత అధికంగా నమోదవుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు పైన నమోదు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. మరణాల సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత లేక పలు ప్రాంతాల్లో దయనీయంగా మరణిస్తున్నారన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.