బీహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్.. ఆమోదం తెలిపిన క్యాబినెట్

బీహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాత్ నిశ్చయ్ రెండవ భాగానికి చెందిన ఎన్నికల హామీని నెరవేర్చనున్నట్లు సీఎం నితీశ్ చెప్పారు. ఏడు హామీల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం కూడా ఒకటని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. వాస్తవానికి బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోలో ఆ అంశం ఉన్నది. అయితే బీహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అధికార బాధ్యతలు చేపట్టింది. ఆ కూటమిలో బీజేపీ, జేడీయూ పార్టీలు ఉన్నాయి.