పరభాషా వ్యామోహం నుంచి బయటపడాలి: వెంకయ్యనాయుడు

పరభాషా వ్యామోహాన్ని వీడి తెలుగు భాష పరిరక్షణకు తెలుగువారంతా సంఘటితం కావాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వర్చువల్ సమావేశానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని సంఘటితంగా కట్టి ఉంచేందుకు రెండు గొలుసులు ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మొదటిది మాతృభూమి అయితే, రెండోది సంస్కృతి అన్నారు.

మన ఆట, పాట, భాష, యాస, గోస, కట్టుబొట్లు లాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింప చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భాషను విస్మరిస్తే భావి తరాలు ప్రమాదంలో పడతాయని, మన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్నీ వారికి దూరమవుతాయని అన్నారు.

 కాబట్టి తెలుగు వారంతా భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని, భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చకపోతే సంరక్షించుకోవడం కష్టమని వెంకయ్య అన్నారు. భాషాభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి సరిపోదని అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరమవుతుందన్నారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమన్న అపోహ సమాజంలో స్థిరపడిపోయిందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులు మాతృభాషలో విద్యను అభ్యసించినవారేనని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. చిన్నారులను మాతృభాషలోనే చదివించాలని కోరారు.