భారత సరిహద్దుల్లో 118 మంది పాక్ ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ అలర్ట్!

భారత్ లోకి చొరబడి, ఉగ్రదాడులు చేసేందుకు సరిహద్దుల్లో దాదాపు 118 మంది వరకూ ఉగ్రవాదులు చేరారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) అలర్ట్ అయింది. ఇక్కడి భారత దళాలతో దాడులు చేయాలన్న వ్యూహంతో వీరు సరిహద్దులకు చేరారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరి వద్ద జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయని, వాటిని ఐఎస్ఐ సమకూర్చిందని, వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద వీరు నక్కి ఉన్నారని పేర్కొన్నాయి.

వాస్తవానికి గత నవంబర్ లోనే ఉగ్రవాదులు ఒక చోటకు చేరుతుండటంపై ఇంటెలిజన్స్ కు ఉప్పందింది. కశ్మీర్ లోయ సమీపంలో 65 మంది టెర్రరిస్టులు ఆయుధాలతో సహా ఉన్నారని, వారు ఏ క్షణమైనా జొరబడవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. శీతాకాల పరిస్థితులు తమకు అనుకూలమని భావిస్తున్న ఉగ్రవాదులు, లునియా ధోక్, చిరికోట్ నబన్, దేగ్వార్ ట్రెవాన్, పీపి నాలా, కృష్ణ ఘాటి, భీంబర్ గాలి, నౌషెరా, సుందర్బానీ తదితర లాంచ్ ప్యాడ్లకు చేరారని తెలుస్తుండటంతో సరిహద్దుల్లో పహారాను మరింత కట్టుదిట్టం చేశారు.